Monday, November 21, 2011

ఉత్తర ప్రదేశ్ విభజన తీర్మానాన్ని, ప్రవేశపెట్టిన మాయావతి సర్కార్ మూజువాణి ఓటుతో ఆమోదం

ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని నాలుగు చిన్న రాష్ట్రాలుగా విభజించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మాయావతి సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానం నిరసనలు, గందరగోళం మధ్య మూజువాణి ఓటుతో ఆమోదం పొందింది. ఈ తీర్మానాన్ని సమాజ్‌వాది (ఎస్పీ) పార్టీ వ్యతిరేకించింది. అనంతరం శాసనసభ నిరవధిక వాయిదా పడింది.
కాగా యూపీ శాసనసభ సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభం కాగానే సమాజ్‌వాది, భారతీయ జనతా పార్టీలు కలిసి మాయావతి సర్కార్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టనున్నట్లు స్పీకర్‌కు నోటీసులు ఇచ్చాయి. రాష్ట్రాన్ని నాలుగు ముక్కలుగా విభజించాలన్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతి నిర్ణయంపై అసంతృప్తితో వారు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అవిశ్వాస తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించారు.
మాయావతి ఈరోజు ఉదయం అసెంబ్లీకి చేరుకోక మునుపే సమాజ్‌వాది పార్టీ ఎమ్మెల్యేలు మాయావతికి వ్యతిరేకంగా పోస్టర్లు, బ్యానర్లతో సభలో ప్రవేశించారు. స్పీకర్ అభ్యంతరం తెలపడంతో సభ్యులు పొడియంను చుట్టుముట్టి నిరసన తెలియజేశారు. దీంతో సభను 12-20 గంటల వరకు వాయిదా వేశారు. వాయిదా. అనంతరం తిరిగి ప్రారంభం కాగానే మాయావతి యూపీ విభజన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఉత్తర ప్రదేశ్‌ను నాలుగు చిన్న రాష్ట్రాలుగా విభజించాలని చేసిన తీర్మానాన్ని మూజువాణి ఓటుతో శాసననభ ఆమోదించింది. అనంతరం అసెంబ్లీ నిరవదిక వాయిదా పడింది. కేవలం తీర్మానం కోసమే మాయావతి ఈరోజు అసెంబ్లీ ఏర్పాటు చేసినట్లు సమాచారం.